కూసుమంచి, వెలుగు : పేదల సంక్షేమం, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్ శెట్టితో కలిసి తిరుమలాయపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
బీరోలులో రూ.2.59 కోట్లతో బీరోలు నుంచి ఏలువారిగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, రూ.64 లక్షలతో ఎస్సీ కాలనీలో నిర్మించనున్న సీసీ రోడ్లకు, బంధంపల్లిలో రూ.5.50 కోట్లతో దమ్మాయిగూడెం నుంచి సోలిపురం రోడ్డు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు వారు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండేళ్లలో బీరోలుకు రూ.29.92కోట్లు మంజూరు చేశామన్నారు. అనంతరం రాకాసితండా గ్రామంలోని ఆకేరు ముంపు బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ గృహాల మంజూరు పత్రాలను, తిరుమలాయపాలెం మండలానికి చెందిన మస్జిద్ కమిటీలకు, ముస్లిం లకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేశ్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
